Consultation Locations

#202, 3rd Floor, Above Khazana Jewellery, Ashish My Space, Madinaguda, HYD-50

Mon-Sat: Morning: 8.00 - 10.00am, Evening: 6.00 - 9.00pm Sun: Morning: 8.30-9.30am, Evening: Closed

ఎసిడిటీ నొప్పికి, గుండె నొప్పికి మధ్య తేడాను గుర్తించడం ఎలా?

Posted on: 08 Jul 2021

By: Dr Vinoth Kumar

Published in:

Read time:

ఛాతి నొప్పి అనేది చాలా సాధారణ లక్షణం. చిన్న కండరం నొప్పి నుండి గుండెపోటు వరకు ఏదైనా దీనికి కారణం కావొచ్చు. అయితే గుండెపోటుకి సంబందించిన ఛాతినొప్పికి, ఎసిడిటీ వల్ల వచ్చే ఛాతినొప్పికి తేడా తెలియక కొంత గందరగోళం ఏర్పడవచ్చు. ఈ రెండు నొప్పుల మధ్య తేడాను మనం 100 శాతం కచ్చితంగా చెప్పలేనప్పటికి, కొన్ని సూచనల ద్వారా గుండెపోటుని గుర్తించవచ్చు మరియు సరైన సమయంలో డాక్టర్ను సంప్రదించవచ్చు.

1. నొప్పి వచ్చే ప్రదేశం

గుండెపోటుకి సంబందించిన ఛాతినొప్పి అనేది రొమ్ము భాగం నుండి గొంతు భాగం వరకు ఎక్కడైనా రావొచ్చు. ఎక్కువగా ఛాతి మధ్యభాగంలో వస్తుంది. ఒక్కోసారి ఎడమప్రక్క అపుడపుడు కుడిప్రక్క కూడా రావొచ్చు. సాధారణంగా ఎడమ భుజం మరియు ఎడమ మోచేతి నొప్పితో పాటు వస్తుంది. ఒక్కోసారి ఇది గొంతు నొప్పిగా వచ్చి, నడిచే కొద్ది పెరుగుతుంది. ఎసిడిటీ కి సంబందించిన నొప్పి కూడా అదే ప్రదేశం లో వచ్చినప్పటికి, ఎడమ చేయి లేదా భుజం నొప్పి ఈ ఎసిడిటీ నొప్పిలో కనిపించదు.

2. సంబంధిత లక్షణాలు

గుండెపోటు కి సంబందించిన నొప్పి, చెమటలు పట్టడం, వాంతులు, అసాధారణ నీరసం వంటి లక్షణాలను కలిగి ఉండవచ్చు. మరొక చాలా ముఖ్యమైన లక్షణం ఏంటంటే, నడుస్తున్నపుడు శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది తలెత్తడం. గ్యాస్ట్రిక్ నొప్పి లో కూడా వాంతులు అవ్వచ్చు కానీ శ్వాస సంబంధిత సమస్యలు ఉండవు.

3.నొప్పిని పెంచే లేదా తగ్గించే కారకాలు

గుండెలో అడ్డంకుల వల్ల కలిగే నొప్పి రెండు రకాలుగా రావొచ్చు.

  •  గుండెలో అడ్డం 80-90% కన్నా తక్కువ ఉన్నట్లయితే.. రోగి నడుస్తున్నపుడు, మెట్లు ఎక్కుతున్నపుడు లేదా ఎక్కువ బరువులు మోసినపుడు గుండెపోటును అనుభూతి చెందుతాడు. అలాంటపుడు నడవటం మానేసినా, కొంత విశ్రాంతి తీసుకున్నా, 5 నుండి 10 నిముషాల్లో నొప్పి తగ్గిపోతుంది.
  • ఒకవేళ రక్తనాళాలు పూర్తిగా మూసుకుపోయినట్లయితే, రోగి విశ్రాంతిలో ఉన్నప్పటికీ నొప్పిని అనుభూతి చెందుతాడు. పైగా 10 నిముషాలు విశ్రాంతి తీసుకున్నప్పటికి నొప్పి తగ్గదు. ఇంకా వస్తూనే ఉంటుంది. గుండెపోటు అనేది చనిపోతున్న గుండె యొక్క కండరాల నొప్పి. కాబట్టి ఎప్పుడైతే ఛాతినొప్పి.. చెమటలు, వాంతులు, నీరసం వంటి లక్షణాలతో వస్తుందో, అది ప్రమాదకరమైన గుండెపోటుకు దారి తీయవచ్చు. కానీ గ్యాస్ట్రిక్ సమస్య వల్ల కలిగే నొప్పి ఏమి తినకపోవడం లేదా కారంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల వస్తుంది. దానికి శారీరక పనులతో సంబంధం లేదు.

4. సంబంధిత ప్రమాద కారకాలు

ఛాతినొప్పితో ఉన్న వ్యక్తి కింది లక్షణాలను కలిగి ఉంటే, గుండె గదుల్లోకి కొవ్వు చేరి,ఆ నొప్పి ప్రమాదకరమైన గుండెపోటుగా మారడానికి ఎక్కువ అవకాశం ఉంది.

• గుండెపోటు కలిగిన కుటుంబ చరిత్ర (తండ్రి లేదా సోదరునికి 55 సం.లకు ముందు లేదా తల్లి లేదా సోదరికి 65 సం.లకు ముందు గుండె శస్త్రచికిత్స జరిగినట్లయితే )
• దీర్ఘకాలిక మధుమేహం, హై బి.పి, హై కొలెస్ట్రాల్
• దూమపానం
• చలనం లేని జీవనశైలి
• చెడు ఆహారపు అలవాట్లు

క్లుప్తంగా చెప్పాలంటే, గుండె సమస్యలు కలిగిన ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శ్వాసలో ఇబ్బందితో పాటుగా ఛాతినొప్పి వచ్చినపుడు, శారీరక వ్యాయామంతో పాటు నొప్పి పెరుగుతున్నపుడు, ఛాతినొప్పితో పాటుగా భుజం, గొంతునొప్పి కూడా ఉన్నపుడు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. 5-10% రోగులు పైన చెప్పబడిన గుండెపోటుకి సంబందించిన ఏ రకమైన లక్షణాలను అనుభూతి చెందకపోవచ్చు. కాబట్టి అనుమానం కలిగిన వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది.